మంథనిలో నమ్మకద్రోహ రాజకీయాలు
ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌పై పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు
కాకతీయ,మంథని : మంథని నియోజకవర్గంలో నమ్మిన నాయకులకే ద్రోహం చేయడం దుద్దిళ్ల శ్రీధర్ రాజకీయ శైలిగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడిన నాయకులను సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక సమయంలో పూర్తిగా పక్కనబెట్టడం దారుణమన్నారు.ప్రజల్లో, కార్యకర్తల్లో ఎమ్మెల్యేపై నమ్మకం పూర్తిగా కోల్పోయిందని, ఇదే విషయాన్ని వరుసగా హెచ్చరిస్తున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇవ్వడం, మాట తప్పడం, నమ్మిన వారిని మోసం చేయడం ఆ కుటుంబం రాజకీయాల్లో సాధారణమైందని ఎద్దేవా చేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశ్వాసంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను పక్కకు నెట్టివేసి బీఆర్‌ఎస్ నేతలకు కండువాలు కప్పి ఏకగ్రీవాలు చేయించడమే శ్రీధర్ నిజస్వరూపమన్నారు. మైదుపల్లి, చందనాపూర్, మహాదేవ్‌పూర్ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులకు అవకాశమే ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి రేపిందని పేర్కొన్నారు.చందనాపూర్‌లో ఎన్నేళ్లుగా పార్టీ కోసం పోరాడిన బాబుమియా వంటి నేతను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనే ఈ స్థాయి నమ్మకద్రోహం చేస్తే, రాబోయే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా ఎలాంటి రాజకీయ కుతంత్రాలకు శ్రీధర్ తెగబడతాడో పార్టీ నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీ నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి ఇప్పటివరకు ఒక్కరినైనా సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.మూడువందల కుటుంబాల ఆధారంతో 40 ఏళ్లుగా అధికారం తమ సొత్తుగా భావించే ఆ కుటుంబం ప్రజలనూ, నమ్మిన కార్యకర్తలనూ వరుసగా మోసం చేస్తోందని మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించాలని, వారి నీతిహీన రాజకీయ శైలిని ప్రత్యక్షంగా చూశానని, అందుకే పదే పదే హెచ్చరిస్తున్నానని అన్నారు.నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే శ్రీధర్‌ను 420 హామీలు ఇచ్చే దొంగ ఎమ్మెల్యే గా భావిస్తున్నారని, మహాదేవ్‌పూర్‌లో రాత్రికి రాత్రే అభ్యర్థులు మార్పు కూడా అదే మోసపూరిత ధోరణికి ఉదాహరణనని మధూకర్ ఆరోపించారు.


