మానవ హక్కులు పుట్టుకతో వచ్చేవి
ఎవరి దయా దాక్షిణ్యాలు కావు..!
కేయూ పాలక మండలి సభ్యుడు చిర్ర రాజు గౌడ్
కాకతీయ హన్మకొండ : మానవ హక్కులు లేకపోతే మన జీవితం గౌరవంలేని జీవనంగా మారుతుంది. మానవ హక్కులు అనేవి ప్రభుత్వం ఇచ్చిన దయ కాదు, న్యాయస్థానాలు ఇచ్చిన బహుమతికాదు,పుట్టుకతోనే ప్రతి మనిషికి లభించిన సహజ హక్కులని కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అన్నారు. సుబేదారి లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ సుదర్శన్ అధ్యక్షతన జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం “మానవ హక్కులు –మనము ప్రతి రోజూ జీవించడానికి అవసరాలు” అనే ముఖ్యమైన అంశం అంశంపై సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ .విద్య పొందే హక్కు లేకుంటే జ్ఞానం ఎలాపెరుగుతుంది? ఆరోగ్య హక్కు లేకుంటే జీవితం ఎలా సురక్షితం అవుతుంది?వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుంటే మన అభిప్రాయాలు ఎలా బయటకు వస్తాయి?సమానత్వం లేకుంటే సమాజం ఎలా ముందుకు పోతుంది? మానవ హక్కులు పుస్తకాలలో మాత్రమే ఉండే మాటలు కాదని అన్నారు. మానవ హక్కుల అర్థం మన రోజువారి జీవితంలో అమలులోకి రావాలని అన్నారు. మానవ హక్కులు విలాసవంతమైన మాటలు కావు,అవి మన ప్రతిరోజు జీవనానికి అవసరమైన మూలాధారాలని అన్నారు. కార్యక్రమంలో కేయూ పాలక మండలి సభ్యులు పుల్లూరు సుధాకర్ , విశ్రాంత టి విజయ్ చందర్, విశ్రాంత ఆచార్యులు సుధాకర్, మానవ హక్కుల ఫోరం తెలంగాణ కోఆర్డినేటర్ ధర్మారపు రాజ గోవింద్, కేయూ లా డీన్ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ చల్ల శ్రీనివాస్, డాక్టర్ ప్రభాకర్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులు అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు.


