కరీంనగర్‌ను కాంగ్రెస్ అడ్డాగా మార్చేస్తాం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఖాయమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తోందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం మైత్రి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. గ్రానైట్ పేరిట గత పాలకులు కోట్లాది రూపాయలు దోచుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, ఇకపై అలాంటి దోపిడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వదని హెచ్చరించారు. కొత్తపల్లి మండలంతో పాటు కరీంనగర్ రూరల్ ప్రాంతంలోని 20 గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజేందర్ రావు చెప్పారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసీ సహా ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ విజయమే ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుతో వచ్చిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని వివరించారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులను యజమానుల పేర్లతో మార్చడం వంటి అనేక పథకాలు ప్రజలకు భారీగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. బావుపేట, బహుదూర్‌ఖాన్‌పేట ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ స్థానాల్లో అత్యధిక విజయాలను సాధించడం కాంగ్రెస్ లక్ష్యమని, కరీంనగర్ గడ్డను కాంగ్రెస్ కోటగా మార్చడం తమ సంకల్పమని రాజేందర్ రావు స్పష్టం చేశారు.


