పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
నిరంతర నిఘాతో ప్రశాంత పోలింగ్‌కు సిద్ధం
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అశాంతి లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలతో కలిసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, ఫీల్డ్ స్టాఫ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 19 శాతం కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఈ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో స్టాటిక్ పార్టీ విధులు నిర్వర్తించనుండగా, మార్గాల్లో రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల రోజున సంభవించే అత్యవసర పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రతి మండలానికి ఏసీపీ స్థాయి అధికారిని బాధ్యతలో పెట్టి, వారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. కమిషనరేట్‌ను 104 క్లస్టర్లుగా విభజించి, ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను కేటాయించామన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సాధారణ రాత్రి గస్తీతో పాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో అదనపు గస్తీ బృందాలు పనిచేయనున్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై బైండోవర్‌లు పూర్తి చేసి, వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అశాంతి లేకుండా విజయవంతంగా జరగడానికి ప్రజలు మరియు రాజకీయ పార్టీ ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు.


