కేయూలో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం
కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా డీన్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో, వివిధ విభాగాల సమన్వయంతో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ మంగళవారం కేయూలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మైక్రోబయాలజీ విభాగంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించి విద్యార్థుల పోస్టర్ ప్రదర్శనలను పరిశీలించారు. ఆయనతో పాటు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. మనోహర్, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రో. మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. ప్రొ. రామచంద్రం మాట్లాడుతూ.. నోబెల్ ప్రైజ్ డే వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం లో కీలక పాత్ర పోషిస్తాయని, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇవి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం బయోటెక్నాలజీ విభాగాన్ని సందర్శించి విద్యార్థుల ప్రజెంటేషన్లను అభినందించారు. లైఫ్ సైన్సెస్‌కి చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


