తిమ్మాపూర్ పీహెచ్‌సీలో తనిఖీలు
సేవల నాణ్యతపై డీపీఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి ఆరా
కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, డీపీఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి కలిసి తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా పరిశీలించారు.హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రికార్డులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రామక వ్యాధులతో బాధపడుతున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న మందుల పంపిణీ విధానాన్ని తనిఖీ చేశారు. ఫార్మసీ స్టోర్స్‌లో సీజనల్ వ్యాధుల మందుల నిల్వలను, పిల్లల టీకాలకు ఉపయోగించే ఐఎల్ఆర్ రోజువారి ఉష్ణోగ్రత రికార్డులను పరిశీలించారు.ఐఇసీ బోర్డుపై ప్రదర్శించిన హైబీపీ, షుగర్ మందుల వివరాల స్పెసిమెన్లను పరిశీలిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలను మెరుగుపర్చాలని సూచించారు. మహిళా ఆరోగ్య క్యాంపుల్లో రీస్క్రీనింగ్‌ను 100% పూర్తి చేసి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యతపై కూడా అధికారులు తనిఖీ జరిపారు. గర్భవతి పరీక్షల కోసం వచ్చిన మహిళలకు స్పందిస్తూ, క్రమబద్ధమైన చెక్‌అప్స్ చేయించుకోవాలని, అవసరం లేని సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే సమస్యలను వివరించారు. సాధ్యమైనంత వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సాధారణ ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు.వైద్య సిబ్బందితో డెలివరీలపై సమీక్షిస్తూ, పీహెచ్సీ నార్మల్ డెలివరీ రేటును మరింత మెరుగుపర్చాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో డిపిఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి, తిమ్మాపూర్ పీహెచ్సీ వైద్య అధికారి ప్రిసిల్లా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


