శ్రీరామ కాలనీలో నీటి సమస్యకు చెక్
అమృత్ స్కీంతో తాగునీరు అందుబాటులోకి
బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర 39వ డివిజన్ పోచమ్మవాడ పరిధిలోని శ్రీరామ కాలనీ వాసుల ఐదేళ్ల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. వరుసగా ఎదురవుతున్న నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బండి సంజయ్, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసి అమృత్ స్కీం కింద తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన మున్సిపల్ అధికారులు వేగంగా పైప్‌లైన్ పనులు పూర్తి చేసి నీటి సరఫరాను ప్రారంభించారు.సోమవారం బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్, స్థానికులు కలిసి కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, నల్ల కనెక్షన్‌ను ప్రారంభిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇన్నేళ్ల నిరీక్షణకు తెరదించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులకు మాసం గణేష్ మరియు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


