ఎన్నికల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించాలి
ప్రతీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి
ములుగు జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రశాంత్ కుమార్
రెండో విడత పోలింగ్ సన్నద్ధతపై అధికారులకు శిక్షణ
కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండవ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ సన్నద్ధతపై సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. డిసెంబర్ 14 న సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు (పీఓలు, ఏపీఓలు) సోమవారం జెడ్ పి హెచ్ ఎస్ మల్లంపల్లి, జెడ్ పి హెచ్ ఎస్ ములుగు, జెడ్ పి హెచ్ ఎస్ లలో వేరు వేరుగా ఎన్నికల నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ సందర్శించి, ఎన్నికల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలు మరియు మార్గ్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ యొక్క నియమ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుని, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఈ పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకొని సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్ మెంట్, సిటింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు “నోటా” సింబల్ ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన అన్నారు. అనంతరం ఎం పి డి ఓ వెంకటాపూర్ కార్యాలయం లో బ్యాలెట్ పేపర్ లను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఎం పి డి ఓ లు, ఎంపి ఓ లు, ఆర్.ఓ.లు, ఏ ఆర్ ఓలు, పి.ఓ.లు., ఏపి ఓ లు తదితరులు పాల్గొన్నారు.


