కాకతీయ, తెలంగాణ బ్యూరో: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, క్రిష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్ ప్లడ్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
అటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులో ప్రమాద సూచికలను ఎగురవేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో క్రిష్ణా నది పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వాహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పంట్లు, నాటు పడవలపై నదిలో ప్రయాణించకూడదని సూచించారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.


