సుబేదారి పీఎస్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
పోలీసుల పనితీరుపై సమీక్ష..
కాకతీయ, హనుమకొండ : సుబేదారి పోలీస్ స్టేషన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై ఆమె సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు, స్పందన వేగం, ముఖ్యంగా మహిళా, పిల్లల ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. డీసీపీ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. దీనిలో భాగంగా పోలీసులు గ్రామ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని ఆదేశించారు. మారక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. యువతలో డ్రగ్స్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీసీపీ ధారా కవిత సిబ్బందికి సూచించారు.


