వ్యర్థాలతో వినూత్న నిర్మాణం
సీఎస్ఐ పాఠశాలకు జిల్లా స్థాయి బహుమతి
కాకతీయ, గణపురం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన గాంధీనగర్ లోని సీఎస్ ఐ సిస్టర్ ఇడితినీవ్ మెమోరియల్ హై స్కూల్ మరో విజయాన్ని సాధించింది. ఇటీవల జరిగిన సైన్స్ ఫెయిర్‌లో ఈ స్కూల్ విద్యార్థి బి.హర్షన్ జిల్లా స్థాయిలో బహుమతి సాధించాడు. ‘లో కాస్ట్ కన్స్ట్రక్షన్ విత్ ప్లాస్టిక్ అండ్ గ్రోయింగ్ ప్లాంట్స్’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో హర్షన్ ప్లాస్టిక్ వ్యర్థాలతో చవకగా ఇళ్లు, రహదారులు నిర్మించడాన్ని, అలాగే సీసాలను ప్లాంట్లుగా మార్చి మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించాడు. బయాలజీ టీచర్ బొట్ల గణేష్ మార్గదర్శకత్వంలో రూపొందిన ఈ ప్రణాళిక పర్యావరణానికి మేలు చేస్తూనే తక్కువ ఖర్చుతో నిర్మాణం సాధ్యమని నిరూపించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇటుకలుగా, ఖాళీ సీసాలలో ఇసుక నింపి గోడలుగా మార్చడం వంటి అంశాలు ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటితో గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో మారుతాయని హర్షన్ వివరించాడు. ఒకేసారి వ్యర్థాల వినియోగం, పచ్చటి వాతావరణం, తక్కువ ఖర్చు నిర్మాణం అనే మూడు లక్ష్యాలను చేరుకునే ఆలోచనగా ప్రాజెక్ట్ గుర్తింపు పొందింది. ఈ విజయం పాఠశాల గౌరవాన్ని పెంచిందని హెడ్‌మిస్ట్రెస్ సిస్టర్ అన్నాజాన్ మరియు ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు. హర్షన్ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చూపాలని వారు ఆకాంక్షించారు.


