కాకతీయుల మ్యూజియం ప్రారంభమెప్పుడు..?
నిర్మాణం పూర్తయి మూడేళ్లు.. ప్రారంభించకుండా నిర్లక్ష్యం
కోట్ల రూపాయల నిర్మాణం పోకిరీల పాలు.. పటించుకొని పర్యాటక శాఖ
కాకతీయుల ఘన చరిత్రను ప్రస్తుత తరానికి అందించలేమా?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా లోని ఓరుగల్లు కోట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజుల రాజధాని ఓరుగల్లు కోట ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఇప్పటి పాలకుల నిర్లక్ష్యానికి ఓరుగల్లు కోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చారిత్రక కట్టడాలను పరిరక్షించి టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకం ద్వారా వందల కోట్లు నిధులు విడుదల చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వలన ఓరుగల్లు కోట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. పురావస్తు శాఖ మ్యూజియం నిర్మాణం 80% పూర్తయినప్పటికీ, మిగిలిన పనులకు నిధులు లేకపోవడంతో ఆలస్యం అవుతోందని అధికారులు అంటున్నారు . ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వెనుక ఉన్న పాత మ్యూజియంలో 1200కి పైగా కాకతీయ కాలం వస్తువులు భద్రపరిచి ఉన్నాయి.
2024 ఆగస్టులో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్‌ను ఎకో, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి, సెప్టెంబర్ 9న మ్యూజియం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ మంత్రి ప్రణాళిక ప్రయత్నాలు కూడా సఫలం కాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పర్యాటకులు, స్థానికులు మ్యూజియం ఆలస్యంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వంతో అంధకారంలో..
కేంద్ర పురావస్తు శాఖ మంజూరు చేసిన నిధులతో దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన మ్యూజియం భవనం మూడేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ఖిలావరంగల్ శిల్పాల ఆవరణకు సమీపంలోనే దీన్ని నిర్మించిన అధికారులు, కాకతీయుల కళావైభవాన్ని తెలిపే మ్యూజియంగా మల్చడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన మ్యూజియాన్ని అధికారులు గాలికి వదిలేసారు. కాకతీయుల కాలం నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన రాతి విగ్రహాలు, అప్పటి పనిముట్లు, బంగారు నాణేలు, బంగారు ఆభరణాలు, ముఖ్యమైన తాళపత్ర గ్రంథాలు, యుద్ధానికి వాడిన రాతి ఫిరంగులు, కాకతీయుల వైభవం ఉట్టి పడేలా ఉండే వారి అపురూప కట్టడాలు ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందిన చారిత్రక సంపదతో కళకళలాడ్సిన మ్యూజియం ఖాళీగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొంతమంది మద్యం సేవించేందుకు, పేకాటకు, ఇంకా అనేక అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు.కాకతీయుల శిల్పాలను, జీవన విధానాన్ని, పరిపాలనను, చారిత్రక ఆనవాళ్లను, ఆధారాలను, పురావస్తుశాఖ సేకరించిన పరికరాలను, నాణెలను, చారిత్రక గ్రంథాలను ఇలా కాకతీయుల సర్వ సమాచారాన్ని ఒక్కచోట చేర్చి సందర్శకులకు తెలియజేయాలనే ఉన్నత లక్ష్యంతో మ్యూజియం ఏర్పాటుకు పాదుకోల్పారు. అయితే కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, టూరిజం శాఖ అధికారులు సంయుక్తంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం సిద్ధంగా ఉన్నప్పటికి శిల్పాలను తరలించడం, ఇతరత్రా మౌలిక వసతులు, మ్యూజియంకు కావాల్సిన విధంగా భవనాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం.
భద్రతలో అధికారుల అలసత్వం
చారిత్రక నైపుణ్యం తో ఎంతో వైభవంగా వర్ధిల్లిన కాకతీయుల శిల్పా కట్టడాలు తరుచూ ఎక్కడో ఓ గ్రామంలో బయల్పడుతూనే ఉన్నాయి.ఇలా వెలుగు చూస్తున్న కట్టడాల పరిరక్షణకు చర్యలు మాత్రం శూన్యంగానే మిగులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. వాటి మహోన్నత్వాన్ని జనాలకు తెలియజేయడంలో పురావస్తు శాఖ అధికారుల వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిడిగొండ, నీరుకుళ్ళ, మడికొండ, మొగిలిచెర్ల, రామానుజపురం, వేల్పుగొండ, పర్లపల్లి, రేగొండ లాంటి ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో శిథిల శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపిస్తోంది. ఇక్కడ ఏ చిన్న తవ్వకం జరిపినా ఏదో ఒక శిథిల శిల్పమో, లేదా ఏ పురాతన కట్టడం తాలూక అవశేషమో బయటపడుతుంది. వీటి విలువ, ప్రాముఖ్యత తెలియని గ్రామస్థులు ఆ రాళ్లను, శిల్పాలను ఇళ్ళ పునాదులకో, లేక ఇతరత్రా నిర్మాణాలకు వాడుకుంటున్నారు. వాటిని పరిరక్షించాల్సిన అధికారులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభానికి పర్యాటకుల ఎదురు చూపులు
కాకతీయుల చరిత్రను నిక్షిప్తం చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్లక్ష్యానికి గురైన కాకతీయుల కళాసంపదను ఒక్క చోట చేర్చి ఓపెన్ ఎయిర్ మ్యూజియంగా ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. అదే సమయంలో కాకతీయుల కళా సంపదను గుర్తించేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వందల సంఖ్యలో శిల్పాలను సర్వేల్లో గుర్తించారు. అయితే గుర్తించిన అతికొన్ని మాత్రమే శిల్పాల ఆవరణకు చేరుకున్నాయి. ఇంకా అనేకం ఎక్కడివక్కడే అన్నట్లుగా ఉన్నాయి. వాటన్నింటిని ఖిలావరంగల్‌లోని శిల్పాల ఆవరణకు లేదా కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియంకైనా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.



