డిసెంబర్ 14న ‘అమాట్–2025’ గణిత ఒలింపియాడ్
అమాట్ గోడప్రతి ఆవిష్కరించిన డా. వి. నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 14న అల్ఫోర్స్ విద్యాసంస్థలు ‘అమాట్–2025’ గణిత ఒలింపియాడ్ పరీక్షను నిర్వహించనున్నాయి. వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో అమాట్ 2025 గోడప్రతిని ఆవిష్కరిస్తూ డా.వి.నరేందర్ రెడ్డి మాట్లాడారు. భారత గణిత మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో ఈ పరీక్షను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ, స్టేట్, ఐసిఎస్ఇ విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పరీక్ష డిసెంబర్ 14న ఉదయం 10 నుండి 11 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. మొత్తం 100 మార్కుల ఈ పరీక్షలో ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు జవాబుకు 1 మార్కు విధానం ఉండనున్నట్లు వివరించారు.ప్రతి తరగతిలో మొదటి 20 స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంస పత్రాలు, ప్రత్యేక బహుమతులు అందజేస్తారని తెలిపారు. అలాగే తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా ₹5000, ₹3000, ₹2000 నగదు బహుమతులు జ్ఞాపికలతో పాటు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. విజేతలను డిసెంబర్ 22న జరగనున్న రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.అమాట్ పరీక్షకు ఆసక్తి గలవారు ఈ నెల 12లోగా పేర్లు నమోదు చేసుకోవచ్చని, వివరాలకు 92469 34441, 92469 34456, 93982 30614 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల సిబ్బంది, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


