డీప్‌ఫేక్‌లకు రెడ్ సిగ్నల్.. లోక్‌సభలో కొత్త బిల్లు సంచలనం!
ఏఐ యుగంలో అదుపు తప్పుతున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ
డీప్‌ఫేక్‌లను కట్టడి చేసేందుకు లోక్‌సభలో కీలక బిల్లు
అనుమతి లేకుండా నకిలీ కంటెంట్ సృష్టించినా, ఫార్వర్డ్ చేసినా కఠిన శిక్షలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రస్తుత కృత్రిమ మేధస్సు విప్లవంలో రోజురోజుకు ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది. కానీ ఈ అభివృద్ధికి తోడు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ యుగంలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక ప్రమాదం డీప్‌ఫేక్. నకిలీ వీడియోలు, ఆడియోలు, ఫోటోలు… అసలు వ్యక్తి చేయని పనిని చేసినట్లు చూపించడం… అసలే మాట్లాడని మాటలు మాట్లాడినట్లు హావభావాలతో రూపొందించడం.. ఇవన్నీ ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే సాధ్యమవుతున్నాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోల వల్ల సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్‌లను కట్టడి చేయడానికి లోక్‌సభలో ఒక కీలక బిల్లు ప్రవేశపెట్టబడింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రైవేటు మెంబర్ బిల్లు రూపంలో ఈ ప్రతిపాదనను సమర్పించడంతో పార్లమెంట్‌లో కొత్త చర్చకు ఊపు వచ్చింది. డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేయడానికి సంబంధిత వ్యక్తి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తూ నకిలీ కంటెంట్ సృష్టిస్తే, అది నేరపూరిత చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం తయారు చేయడమే కాదు… డీప్‌ఫేక్ వీడియోలు లేదా ఆడియోలను ఫార్వర్డ్ చేసిన వారిపైనా శిక్షల ప్రక్రియ ఉండాలని బిల్లులో పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే ఇలాంటి నకిలీ కంటెంట్ వ్యాప్తి చెందడంలో షేర్ చేసే వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. వేధింపులు, మోసాలు, తప్పుడు ప్రచారం వంటి అక్రమ కార్యకలాపాలకు డీప్‌ఫేక్‌లను వినియోగిస్తున్న నేపథ్యంలో దీన్ని కఠినంగా అరికట్టాల్సిన సమయం వచ్చిందని శిందే హెచ్చరించారు.
డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత గోప్యతకు మాత్రమే కాదు, జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీవేగంగా అభివృద్ధి చెందడం, ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం మరింత సులభమవడం వల్ల నకిలీ కంటెంట్ తయారీ ప్రమాదకరంగా పెరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో డీప్‌ఫేక్‌ల ప్రమాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నకిలీ వీడియోలు, ఆడియోల ద్వారా సమాజంలో కల్లోలం సృష్టించే ప్రయత్నాలు దేశ భద్రత, సమాజ శాంతి రెండింటినీ ప్రభావితం చేస్తున్నాయని ఆయన వార్న్ చేశారు. ఇక ఇప్పుడు లోక్‌సభలో ప్రవేశించిన ఈ కొత్త బిల్లు డీప్‌ఫేక్‌లకు నిజంగా రెడ్ సిగ్నల్ అయ్యేటట్లే కనిపిస్తోంది.


