మా ఉసురు తగిలింది..!
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి రైతుల శాపాలు
గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న మాకు న్యాయం చేయలేదు
కనీసం మార్కెట్ రేటు కూడా చెల్లించకుండా అడ్డుపడుతున్నాడు
ఆయన జనాలను లంచాలతో పీల్చుకుతిన్నాడు
ఆయన ఆస్తులపై విచారణ చేసి ఆస్తులు జప్తు చేయాలి
హన్మకొండ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
కాకతీయ, హన్మకొండ : విద్యా సంస్థకు పర్మిషన్ ఇచ్చేందుకు లక్ష రూపాయాలు డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైన హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ హోదాను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ రైతులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం జరిగిన ఏసీబీ దాడుల్లో ముగ్గురిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పాఠశాల అనుమతులకు సంబంధించి రూపాయలు ఒక లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో అరవై వేలు తీసుకుంటున్న సమయంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి (డిఈఓ ఇన్‌చార్జిగా కూడా పనిచేస్తున్నారు)ను ఆయన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో విద్యాశాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది గౌస్, మనోజ్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేసి శనివారం ఉదయం కోర్టులో రిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన.. టపాసులు కాల్చి సంబరాలు
హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ హోదాలో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేశారని రైతులు ఆరోపించారు. శనివారం ఉదయం హన్మకొండ కలెక్టరేట్ ఎదుట దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన పలువురు రైతులు నిరసన ప్రదర్శనకు దిగారు. ఏసీబీకి చిక్కిన వెంకట్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ.. ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రైతులకు న్యాయం జరగకుండా అడ్డుపడ్డాడని రైతులు ఆరోపించారు. కనీసం మార్కెట్ ధర చెల్లించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అదనపు కలెక్టర్ ఆస్తులపై విచారణ జరపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకట్‌రెడ్డి ఏసీబీకి చిక్కడంపై రైతులు సంబరాలు చేసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. ఈ నిరసన ప్రదర్శన ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



