హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపాలి
కలప వ్యాపారుల ద్రోహం వల్లే దొరికిపోయారు
హిడ్మా హత్యకు దేవ్‌జీ కారణంకాదు
దేవ్‌జీ, సంగ్రామ్ పోలీసుల అదుపులోలేరు
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో విడుదల
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కామ్రేడ్స్ హిడ్మా (మారేడుమిల్లి), కామ్రేడ్ శంకర్ (రంపచోడవరం) హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖను విడుదల చేసింది. కామ్రేడ్ హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవజీ కారణమని మనీష్ కుంజాం, సోనీ సోడి ద్వారా ఇచ్చిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను, అతనితో పాటు మరో 5 మంది కామ్రేడ్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబరు 15న అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మావోయిస్టు పార్టీ లేఖలో డిమాండ్ చేసింది.
అక్టోబరు 27న విజయవాడకు ..
“కామ్రేడ్ హిడ్మా అక్టోబరు 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారితో చికిత్స కోసం విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత మరి కొంతమంది కామ్రేడ్లు వెళ్లారు. కామ్రేడ్ హిడ్మాతో సహా 6 మంది కామ్రేడ్లను పోలీసులు హత్య చేసి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తప్పుడు కథను అల్లారు” అని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. “ఈ మేరకు రెండు సంఘటనలలో మా కామ్రేడ్లను బయటకు తీసుకెళ్లిన వ్యక్తులను, ఈ మొత్తం హత్య వెనుక ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లోని 50 మంది గిరిజనులకు సంబంధించిన వ్యాపారి, అదే జిల్లాలోని ఐటిడిఎకు చెందిన కారు డ్రైవరు, విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి, విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తదితరులందరినీ విచారించాలి. ఈ హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.” అని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖలో డిమాండ్ చేసింది.


