కాళోజీ ఇన్‌చార్జి వీసీగా డాక్టర్ రమేష్‌రెడ్డి
బీఆర్‌ఎస్ హయాంలో ఏడేళ్లు డీఎంఈగా అనుభవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతిగా డాక్టర్ కోటా రమేశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో ఏడేళ్లపాటు వైద్య విద్య సంచాలకులుగా (డీఎంఈ)గా పనిజేశారు. అలాగే రెండేళ్లకుపైగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జి కమిషనర్‌గా, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర వైద్యమండలి వైస్ ఛైర్మన్‌గా పనిజేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంతోపాటు ఒకరిద్దరు మంత్రులు కూడా రమేశ్‌రెడ్డి తరఫున లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది.
నందకుమార్‌రెడ్డి రాజీనామా!
కాగా… నవంబర్ 28న కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను అక్రమంగా పాస్ చేశారనే ఆరోపణలు రావడం, విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నందకుమార్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే తిరిగి విధుల్లో చేరి కొత్త వీసీ వచ్చే వరకు తననే ఆపధర్మ వీసీగా కొనసాగమన్నారని ఆయనే మీడియాకు చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇన్చార్జి వీసీగా గతంలో డీఎంఈగా పనిచేసిన అనుభవం ఉన్న రమేష్ రెడ్డిని నియమించడం గమనార్హం.


