సీఎం ఆదేశిస్తే రాజీనామా
నాకు ఎన్నికలు కొత్త కాదు.. 11సార్లు పోటీచేశా
అనర్హతపై సుప్రీంలో నా వాదన వినిపిస్తా
రేవంత్ సీఎంగా పదేండ్లు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం.. ప్రజా సమస్యల మీద పోరాడటం తనకేమి కొత్త కాదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని దానం అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని.. దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా దానం నాగేందర్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు
తన వద్దకు రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని తెలిపిన దానం.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే మాత్రం వెంటనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం మీద సుప్రీకోర్టులో వాదనలు జరుగుతున్నాయని.. తన వాదనను వినిపిస్తానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల అంశంలో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో.. అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకుంటారా.. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా అనేది స్పీకర్ ఇష్టం. ఆయన అభిప్రాయానికే వదిలేస్తున్నాం. నూతన సంవత్సర వేడుకల్ని.. ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్‌నే నిర్ణయించుకోవాలి అంటూ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 19న ఈ కేసు తదుపరి విచారణ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలోనే ఇదే అంశంపై దానం నాగేందర్ స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.


