ఖిలా మ్యూజియంలో దొంగలు పడ్డారు
అర్కియాలజి, టూరిజం శాఖల బాధ్యతల గందరగోళం
ఇంకా కేసు కూడా పెట్టని రెండు శాఖల అధికారులు
కాకతీయ, ఖిలావరంగల్ : పలుమార్లు ప్రారంభోత్సవాలు జరిగినా కూడా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాని ఖిల మ్యూజియంలో దొంగలు పడ్డారు. మ్యూజియం లోని విలువైన కరెంట్ సంబంధిత సామగ్రి దోచుకెళ్లిన ఘటన బయటకు వచ్చింది. సంఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు ఏ విభాగం పిర్యాదు ఇవ్వలేదు. మ్యూజియాన్ని చూసే బాధ్యత ఎవరిది అన్న గందరగోళం కారణంగా ఆర్కియాలజీ, టూరిజం శాఖలు ఒకరి మీద ఒకరు బాద్యత నెట్టుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మ్యూజియం మాకు హ్యాండోవర్ కాలేదని ఆర్కియాలజీ అధికారులు చెబుతుండగా, ఫిర్యాదు చేస్తే బాధ్యత మన మీద పడుతుందనే భయంతో టూరిజం శాఖ జంకుతోందని స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇక మ్యూజియంలో గస్తీ సిబ్బంది లేకపోవటమే దొంగలకు అవకాశం కల్పించిందనే అభిప్రాయం స్థానికులది. ప్రతి సారి ప్రారంభోత్సవాలు, సందర్శకులకు కొత్త వాగ్దానాలు చేస్తున్నా… నిజ జీవితంలో మ్యూజియం రక్షణలో పెద్ద లోటుపాట్లు ఉన్నాయనే విషయం ఈ ఘటనతో మరోసారి బయట పడింది.


