వణికిస్తున్న ` స్క్రబ్ టైఫస్`.. అసలేమిటీ వ్యాధి..?
ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
నల్లి కాటుతో వచ్చే ప్రమాదకర వ్యాధి
జ్వరం ఐదు రోజులు పైగా కొనసాగితే పరీక్షలు తప్పనిసరి
కాకతీయ, నేషనల్: తెలుగురాష్ట్రాల్లో ఇటీవల జ్వరం కేసులు పెరుగుతున్న వేళ, మరో కొత్త భయం ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది.. అదే స్క్రబ్ టైఫస్. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా జ్వరం తగ్గకపోతే… మొదట వైద్యులు అనుమానించే వ్యాధి ఇదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడంతో ప్రజలు, వైద్యవర్గాలు అప్రమత్తమవుతున్నారు.
స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది మనకు నల్లి తరహాలో కనిపించే చిగ్గర్ మైట్ అనే సూక్ష్మ పురుగు కాటు ద్వారా శరీరంలోకి చేరుతుంది. కాటేసినట్టు కూడా తెలియనింత చిన్నది ఈ పురుగు. కానీ కాటు చేసిన ఎనిమిది నుంచి పది రోజుల్లో తీవ్ర జ్వరంతో దాడి చేస్తుంది. ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి సోకదు. కేవలం పురుగు కాటుతో మాత్రమే సోకుతుంది. వ్యవసాయ క్షేత్రాలు, పొదలు, గడ్డి మైదానాలు, నది తీరం, తోటలు… ఇవన్నీ ఈ కీటకాల ప్రధాన నివాసాలు.
ఈ వ్యాధి ఎక్కువగా బయట వాతావరణంలో పనిచేసేవారిని ప్రభావితం చేస్తుంది. పొలాల్లో పని చేసే రైతులు, తోటల్లో తిరిగే పిల్లలు, గడ్డి మైదానాల్లో కూర్చునేవారు, పశువుల పాకల దగ్గర ఉండేవారికి రిస్క్ ఎక్కువ. చిగ్గర్ మైట్లు ఎలుకలు, ఇతర జంతువుల శరీరాలపై కూడా ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభంలో ఇది సాధారణ జ్వరంలానే అనిపించినా, మెల్లగా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న తీవ్ర జ్వరం, వణుకు, శరీరమంతా నొప్పులు, తలనొప్పి, నీరసం, కీటకం కాటేసిన చోట నల్లటి మచ్చ, దద్దుర్లు, అజీర్ణం, వికారం ఈ వ్యాధి లక్షణాలు. తీవ్రమైన దశలో శ్వాసకోశం, మెదడు, కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. చికిత్స ఆలస్యం అయితే ఆర్గన్ ఫెయిల్యూర్ వరకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు నిర్వహించిన 6,678 పరీక్షల్లో 1,317 కేసులు పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాయి. సమయానికి చికిత్స చేస్తే మరణాల రేటు 2% లోపే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆలస్యం అయితే అది 6% నుండి 30% వరకు పెరిగే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ నిర్ధరణకు సిరోలజీ పరీక్షలు చేస్తారు. అంటే రక్తంలోని యాంటీబాడీలను బట్టి వ్యాధిని గుర్తించే పరీక్షలు. ఇందులో ఎలిసా టెస్ట్‌ను ఎక్కువగా చేస్తారు. ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరోసెన్స్ అస్సే (ఐఎఫ్ఏ) పరీక్ష కూడా ఉంటుంది. దీనిని ఈ వ్యాధికి ‘గోల్డ్ స్టాండర్డ్’ పరీక్షగా పరిగణిస్తారు.అయితే ఇది అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండదు.
స్క్రబ్ టైఫస్ కొత్తగా పెరుగుతున్నదేమీ కాదు. సంవత్సరాలుగా ఉన్న వ్యాధే. కానీ పరీక్షలు అందుబాటులోకి రావడంతో కేసులు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఏదేమైనా, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. అందుకే ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా గడ్డి మైదానాలు, పొలాలకు వెళ్తప్పుడు పూర్తి చేతులు కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. కీటకనాశని స్ప్రేలు ఉపయోగించాలి. ఇంటి చుట్టూ గడ్డి పెరుగకుండా శుభ్రపరుచుకోవాలి. పరుపులు, దుప్పట్లు పూర్తిగా శుభ్రం చేసి, దులిపి వాడాలి. పశువుల పాకలు, పొదల్లో ఆడే పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి. శరీరంపై రాషెస్ లేదా కాటు మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.


