హిల్ట్‌పాలసీపై పోరాటం కొనసాగిస్తాం..
ఇది ఆరంభం మాత్రమే..
హిల్ట్ జీవోతో రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణం
అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి
భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావద్దు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రిసిడెంట్ కేటీఆర్
జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్‌లో పర్యటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హిల్డ్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రవేట్ వ్యక్తులకు రేవంత్ సర్కార్ ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదని ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్‌లో పర్యటించింది. ఈసందర్భంగా హమాలీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావని, ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చిన భూములన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చారని గుర్తుచేశారు. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4000కు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నదని విమర్శించారు.

బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెనక్కు..
రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం ఇచ్చి ఏమైనా చేసుకోవచ్చని ప్రభుత్వం అంటోందన్నారు. ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు. ప్రజల కోసం వినియోగించాలని, గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను చూసి పారిశ్రామిక వేత్తలు మోసపోవద్దని తెలిపారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెనక్కు తీసుకుంటామన్నారు. చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగం కావద్దని పారిశ్రామికవేత్తలను కోరారు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ, హిల్ట్ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కోకాపేటలో వందల కోట్లు… జీడిమెట్ల ప్రాంతంలో కోటి రూపాయలు అంటే ఎలా అని ప్రశ్నించారు.
ఎవరి ప్రయోజనాల కోసం..
రేవంత్ రెడ్డి… అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు, దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారని… బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో అందరికీ అవగాహన కల్పిస్తామని.. సమావేశాలు పెడతామని, న్యాయస్థానాల్లో పోరాడతామని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు పెడతామన్నారు. నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రిడ్ పాలసీలో ఐటీ పరిశ్రమలు పెట్టమని చెప్పామని… దాన్ని ఎలా తప్పు పడతారని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భూములను ప్రజలు, కార్మికుల కోసం ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారని… వారికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు తొలగిస్తున్నారని… పెద్దవాళ్ళకు మాత్రం ధారాదత్తం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హిల్ట్ పాలసీ బయటకు ఎలా వచ్చిందని ప్రభుత్వం గింగిరాలు తిరుగుతోందన్నారు. దోపిడీ జరుగుతుంటే ఎవరో తెలంగాణ బిడ్డ సమాచారం ఇచ్చారని తెలిపారు. హిల్ట్ భూముల విషయంలో ఇది ఆరంభం మాత్రమే… పోరాటం ఇంకా కొనసాగిస్తామని, కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.



