బాలసుబ్రహ్మణ్యం విగ్రహం
రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి ?
బీఆర్ఎస్‌ది డివాళకోరు రాజకీయం
సెంటిమెంట్ రగల్చి లబ్ధిపొందే ప్రయత్నం
గులాబీ పార్టీ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు
ప్రతి అంశం రాజకీయం చేయడం తగదు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రవీంద్రభారతిలో మాజీ సీఎం రోశయ్య 4వ వర్ధంతి సభ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు మహేష్ గౌడ్. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు.
రోశయ్యకు ఘన నివాళి
కాగా.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా వి.హనుమంతరావును రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సత్కరించింది. అలాగే రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్కాలర్ షిప్‌లు అందజేశారు.


