వలస కూలీల పిల్లలకు కలెక్టర్ పూర్తి సహకారం
ఇటుక బట్టీల్లోని చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలి
గట్టుబూత్కూరు పాఠశాలలో ప్రత్యేక క్లాస్ ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గంగాధర మండలం గట్టుబూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కూలీల చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని ఆమె ప్రారంభించారు. ఇప్పటికే గుర్తించిన 42 మంది పిల్లలకు ఇక్కడ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు.తరగతి గదిలో పిల్లలను పలకరిస్తూ వారి భాష, స్వస్థలం, కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలోని వలస కూలీల పిల్లలందరినీ గుర్తించి సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది సుమారు 500 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్చామని, ఈ సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, పోషకాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టనున్నట్లు వెల్లడించారు. వలస కూలీల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీల యజమానులతో చర్చించి పాఠశాల వరకు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.వివిధ రాష్ట్రాల నుండి వచ్చే పిల్లల దృష్ట్యా వారికి ఇంగ్లీషు బోధనను ప్రాధాన్యతగా కొనసాగించాలని, ముఖ్యంగా గణితం–ఇంగ్లీషు సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని వాలంటీర్లకు సూచనలు ఇచ్చారు. యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్కులు తదితర అవసరమైన పాఠ్య సామగ్రిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
పూర్వ ప్రాథమిక పాఠశాల పరిశీలన
తరువాత కలెక్టర్ పమేలా సత్పతి పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. చిన్నారులతో మమేకమై వారి అభ్యాస పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆటపాటల ఆధారిత బోధనను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వం పంపిన ఆటవస్తువులు, పుస్తకాలు పూర్తిగా వినియోగించాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంపు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ రజిత, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.


