ముదిరిన పల్లెపోరు.. పోటా పోటీగా నామినేషన్లు
కొన్నిచోట్ల సర్పంచ్ పదవికి జిల్లా స్థాయి నేతలు బరిలోకి
కొన్ని గ్రామాలలో ఇతర పార్టీలతో మూలాఖత్
గీసుగొండ మండలంలో 21 పంచాయతీలకు 176 సర్పంచ్ నామినేషన్లు
కాకతీయ, గీసుగొండ : పంచాయితీ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల గడువు ముగిసే సరికి గీసుగొండ మండలంలో పోటీ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చివరి గంట వరకు అభ్యర్థుల రద్దీ కొనసాగి నామినేషన్ల కేంద్రాలు సందడిగా మారాయి. గ్రామాల్లో రాజకీయ వేడి మరింతగా రావడంతో పోటీ పోటా పోటీగా మారింది. మండలంలోని 21 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు మొత్తం 176 మంది, అలాగే 188 వార్డు సభ్య పదవులకు 598 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామస్థాయిలో పోటీ తీవ్రత ఈ సంఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిరంగంగా బయటపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ పదవులకు ప్రధాన నాయకులే నేరుగా రంగంలోకి దిగడంతో వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉవ్వెత్తున ఎగిసింది. ఒకే పార్టీకి చెందిన వర్గాలు పరస్పరం తలపడుతూ శక్తి ప్రదర్శనకు తెరలేపాయి. ఎమ్మెల్యే రేవూరి వర్గం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడు మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి తలపడగా,కొండా వర్గం నుంచి ఓ జిల్లా నాయకుడు పోటీకి దిగాడు. మరో గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ పదవికి బరిలోకి దిగారు. కొండా వర్గానికి చెందిన మరో జిల్లా నాయకుడు తన సొంత గ్రామంలో తన ఉనికిని చాటుకోవడానికి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. దీంతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతి వర్గం ఉబ్బలాట పడుతోంది.
మొదలైన బుజ్జగింపులు…
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే వర్గీయ చర్చలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. ఒకే పార్టీ నుంచి పలువురు బరిలో ఉండటంతో పెద్దలు, పార్టీ నాయకత్వం కొందరిని వెనక్కి తీసుకునేలా ఒప్పించే యత్నాల్లో నిమగ్నమైంది. గ్రామాలలో కూడా పెద్దలు మధ్యవర్తిత్వం చేస్తూ ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. పల్లెల్లో ప్రతి వాడలో అటువైపు, ఇటువైపు రాజకీయ చర్చలే వినిపిస్తున్నాయి. “మన ఊరిలో సర్పంచ్ పదవి ఎవరెవరు పోటీపడుతున్నారు అన్నా,మన వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారు తమ్మి అంటూ” తారీఫు చేస్తున్నారు. మొత్తం మీద గీసుగొండ మండలంలోని పంచాయితీ ఎన్నికలు ఈసారి సాధారణ స్థానిక ఎన్నికలకే పరిమితం కాకుండా వర్గపోరు, వ్యక్తిగత ప్రతిష్ఠ, పార్టీ ఆధిపత్య పోరాటాలకు వేదికగా మారాయి. బుజ్జగింపుల తర్వాత బరిలో ఎవరెవరు నిలబడుతారు? చివరకు ఏ వర్గం పైచేయి సాధిస్తుంది? అన్న ఆసక్తికర పరిస్థితి నెలకొంది. పంచాయతీ ప్రచారం మొదలైతే మండల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందని మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.


