ఐరోపాలో బెలూన్ల చిచ్చు.. రెండు దేశాల మధ్య కొత్త కోల్డ్ వార్!
బెలారస్–లిథువేనియా మధ్య ఉద్రిక్తతల విస్ఫోటనం
ఎగిరే బెలూన్లతో ఎయిర్‌పోర్ట్‌లు షట్‌డౌన్
60 బెలూన్లు గుర్తింపు, 40 కీలక ఎయిర్‌జోన్‌లోకి ప్రవేశం
కాకతీయ, ఇంటర్నేషనల్ డెస్క్: యూరప్‌లో ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉద్రిక్తతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో, ఇప్పుడు బెలూన్లు రెండు దేశాల మధ్య కొత్త కోల్డ్ వార్‌కు నాంది పలుకుతున్నాయి. బెలారస్, లిథువేనియా మధ్య నెలకొన్న ఈ అసాధారణ వివాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా వాతావరణాన్ని కొలవడానికి ఉపయోగించే వెదర్ బెలూన్లు ఇప్పుడు రన్‌వేలను మూసే స్థాయికి చేరి, గగనతల భద్రతను తలకిందులు చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు బెలారస్ వెదర్ బెలూన్లను ప్రయోగిస్తోంది. అయితే, అవి నియంత్రణ తప్పి లిథువేనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఫలితంగా లిథువేనియాలో విమాన సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లిథువేనియా ఆరోపణల ప్రకారం, ఇటీవల బెలారస్ వైపు నుంచి వచ్చిన 60 బెలూన్లలో 40 నేరుగా అత్యంత కీలకమైన విమాన భద్రతా జోన్‌లోకి ప్రవేశించాయి. ఫలితంగా, విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయం 11 గంటలపాటు పూర్తిగా నిర్వీర్యమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తలనొప్పి అయిందని, ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని బెలూన్లను ఒక ప్రత్యేక పథకం ప్రకారం ప్రయోగిస్తున్నారని లిథువేనియా మండిపడుతోంది. ఈ చర్యలను వారు సూటిగా హైబ్రిడ్ అటాక్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాత్రం ఇవన్నీ వెదర్ బెలూన్లే అని, ఏదైనా తప్పిదం జరిగితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని చెప్పినా, లిథువేనియా దీన్ని అసలు నమ్మడం లేదు. మరోవైపు అంతర్జాతీయ మీడియా మరింత ఆసక్తికర అంశాలను బయటకు తెచ్చింది. ఈ బెలూన్లను నిషేధిత వస్తువులు మరియు అనుమానాస్పద సామగ్రి తరలించడానికి కూడా ఉపయోగించవచ్చని చర్చ నడుస్తోంది.
ఇక బెలారస్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. లిథువేనియానే తమ గగనతలంపై డ్రోన్లను ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది. అదేవిధంగా, బెలూన్లను, డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రి చేరవేస్తున్నారన్న ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఈ పరిణామాలతో రెండు దేశాల దౌత్య సంబంధాలు గట్టిగా దెబ్బతిన్నాయి. లిథువేనియా సరిహద్దులను మూసేయగా, ప్రతిగా బెలారస్ వెయ్యికి పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను నిలువరించింది. కాగా, యూరప్ ఖండం ఇప్పటికే నాటో గగనతలంలోకి ప్రవేశించిన రహస్య డ్రోన్లతో టెన్షన్‌లో ఉండగా, ఇప్పుడు బెలూన్ల వివాదం అగ్నిపర్వతంలా పెల్లుబికే ప్రమాదం కనిపిస్తోంది. బెలూన్లతో మొదలైన ఈ సంక్షోభం, రెండు దేశాల మధ్య భద్రతా సవాళ్లను కొత్త కోణంలో చూపుతూ, ఐరోపా భవిష్యత్ స్థిరత్వాన్నే ప్రశ్నార్థకంగా నిలబెడుతోంది.


