కేసీఆర్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి
దీక్షా దివస్ వ్యాసరచన పోటీల పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులకు కేసీఆర్ లక్ష్యసాధన పాఠం : దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాల భాగంగా ఈ నెల 5న జరగనున్న వ్యాసరచన పోటీల పోస్టర్ను బుధవారం మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాస్యం వినయ్ భాస్కర్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నడిచే అక్షరం అని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల గోసను తీర్చిన ఉద్యమ నేత కేసీఆర్ 14 ఏళ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై చేసిన పోరాటం, అనంతరం 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి నేటి తరానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పట్టుదల, కష్టసాధన, లక్ష్య సాధన విద్యార్థులకు చదువుల్లో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం, పోటీ తత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీక్షా దివస్లో భాగంగా ఈ నెల 5న శుక్రవారం ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అంశంపై ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, కుసుమ లక్ష్మీనారాయణ, పులి రజినీకాంత్, వెంకన్న, జానకిరాములు, నాయీముద్దీన్, మనోజ్ కుమార్, సదాంత్, ఖలీల్, శ్రీధర్, శ్రీకాంతాచారి, చందర్, పుల్లయ్య, రమేష్, బుద్దె వెంకన్న, హరినాథ్, ప్రభాకర్, కొండ్ర శంకర్, రాజు, బీఆర్ఎస్వీ నాయకులు బైరపాక ప్రశాంత్, సూర్యకిరణ్ వర్మ, గండ్రకోట రాకేష్ యాదవ్, వీరాస్వామి, పస్తం అనిల్, స్నేహిత్, రాజేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


