కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలవాలి..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ: రానున్న పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.మండలంలోని ఊకల్ క్రాస్ వద్ద గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో సంగెం,గీసుగొండ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కార్యకర్తలకు ప్రధాన బలం అని పేర్కొన్నారు.పరకాల నియోజకవర్గంలోని 109 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు దారులే సర్పంచులుగా గెలవాలని కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని కీలక నాయకులు చాలెంజ్‌గా తీసుకుని 109 మంది సర్పంచులను కాంగ్రెస్ కండువాలతో తన ముందుకు తీసుకురావాలని పిలుపు నిచ్చారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ. 500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణమాఫీ, వరి పై బోనస్, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను వివరించి ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ అభ్యర్థుల పరాజయానికి ప్రయత్నించే వారిని సహించబోమని ఎమ్మెల్యే రేవూరి హెచ్చరించారు. గెలిచిన సర్పంచుల గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉండి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తారని ఎమ్మెల్యే రేవూరి విశ్వాసం వ్యక్తం చేశారు.


