కాకతీయ, సంగెం: భారీ వర్షాల కారణంగా వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం సంగెం మండలం కాట్రపల్లి – వెంకటాపూర్ గ్రామాల మధ్యనున్న బ్రిడ్జి వాగు వరుస వర్షాలకు కొట్టుకుపోవడంతో,ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక రహదారి వెంటనే నిర్మించాల్సిందిగా, అలాగే శాశ్వత వంతెన పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. అలాగే, ప్రజలు వర్షాలు తగ్గే వరకు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, వర్షపు నీటిలో వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.


