కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కేసీఆర్ పథకాల్ని బందు పెట్టిన కాంగ్రెస్‌ని బొంద పెట్టాలి ఓటుతో బుద్ధి చెప్పాలి
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కమలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో కమలాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అలాగే మూడో విడతలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక,ఇల్లంతకుంట మండలాల్లో కూడా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామపంచాయతీలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడతాయన్నారు.కమలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దశరథం పేరును ఫైనల్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అంతర్గత ఆశావాహులెవరూ బాధపడకూడదని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో అభివృద్ధి అంటే కేసీఆర్ గారు చేసిన పనులే గుర్తుకు వస్తాయి. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఈ ప్రాంతంలో తట్టెడు మన్ను కూడా పోశారా? ప్రజలు ఆలోచించాలి అన్నారు.అలాగే స్థానిక రాజకీయాలపై మండిపడుతూ.ఈ ప్రాంతానికే నాయకుడిని అని చెప్పుకునే ఒకరు ఇక్కడ ఓడిపోయాక బయట ప్రాంతాల్లో పోటీకి వెళ్లాడు. కానీ నేను మాత్రం హుజురాబాద్ ప్రజల కోసం పోరాడుతూ నిలబడిన వ్యక్తిని. బైట ప్రాంతాల నుంచి వచ్చి ‘మీ నాయకున్ని’ అంటున్నవారిని నమ్మొద్దు, అన్నారు.కేంద్ర,రాష్ట్ర నిధుల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తూ 2019 నుండి 2025 వరకు రాష్ట్రం కేంద్రానికి 4 లక్షల కోట్లకుపైగా పన్ను చెల్లించింది, తిరిగి వచ్చినది మూడులక్షల కోట్లలోపే. రాష్ట్రం పంపిన ప్రతి రూపాయికి కేంద్రం 84 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. 16 పైసలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఈ నిజాలపై చర్చకు సిద్ధం అన్నారు.తాను చెప్పినవి అబద్ధమైతే కమలాపూర్ గ్రామంలో ‘ముక్కు నేలకు రాసేందుకు’ కూడా సిద్ధమని సవాల్ విసిరారు.అంతేకాకుండా ఉపఎన్నికల సమయంలో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుంచి ఏమాత్రం నిధులు తెచ్చారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ ఆయన స్వగ్రామం అయినప్పటికీ అక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు.కేసీఆర్ హయాంలో చిన్న గ్రామాలకు 30 కోట్లు, పెద్ద గ్రామాలకు 100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు అందించినవారు కూడా కేసీఆర్ గారేనని గుర్తుచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఒకటొకటిగా బంద్ చేసిందని, ప్రజలు ఈసారి కాంగ్రెస్,బీజేపీలకు ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



