రాజన్న సిరిసిల్లలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా
పోయిన,దొంగిలించిన 65 ఫోన్లు తిరిగి బాధితుల చెంతకు
కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పోయిన, దొంగిలించబడిన సుమారు రూ.60 లక్షల విలువగల 65 మొబైల్ ఫోన్లను జిల్లాలోని పలు ప్రాంతాలు, అలాగే పొరుగు రాష్ట్రాల నుండి గుర్తించి తిరిగి యజమానుల చెంతకు అందజేశారు.అధికారులు మాట్లాడుతూ, నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ ఒక వ్యక్తిగత సొత్తు మాత్రమే కాకుండా, అతని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డులు వంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుందని చెప్పారు. వీక్ పాస్‌వర్డులను పగులగొట్టి దొంగలు ఫోనులో ఉన్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి డిజిటల్ చెల్లింపు యాప్స్ ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.అందువల్ల మొబైల్ కోల్పోయిన వ్యక్తులు కేవలం ఒక ఫోన్ కాదు, తమ వ్యక్తిగత సమాచారాన్ని, డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరికైనా మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ (www.ceir.gov.in) పోర్టల్‌లో తమ ఫోన్ నంబర్, ఐఎంఈఐ వివరాలను నమోదు చేసి ఫోన్‌ను నిలిపివేయాలని సూచించారు. అనంతరం సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా షాపు యజమాని నుండి రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. దొంగిలించిన ఫోన్లను తక్కువ ధరలకు విక్రయించే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలియక కొనుగోలు చేసే అమాయకులు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కొనుగోలు చేస్తే ఆ వ్యక్తిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 2,183 మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేశారు. జిల్లాలో మొబైల్ రికవరీ శాతం 83కు చేరడం పోలీసులు సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ల గుర్తింపులో ప్రతిభ ప్రదర్శించిన ఐటీ కోర్ బృందంలోని కిరణ్‌కుమార్, రాజా తిరుమలేష్‌లను అధికారులు అభినందించారు.మొబైల్ దొరకదని భావించిన తమకు తిరిగి ఫోన్ అందించడంతో బాధితులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐటీ కోర్ సిబ్బంది కిరణ్‌కుమార్, ఆర్.ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.



