తెలంగాణను అగ్రభాగాన నిలబెడుతాం
ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు అండగా నిలిచింది
ముగ్గురు కీలక మంత్రులు ఈ జిల్లాకు చెందినవాళ్లే
పాల్వంచ నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది
దేశంలోనే ఏకైక ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు గర్వకారణం
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే మా ప్రాధాన్యాలు
గ్రామాల్లో సర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి
రాజకీయ కక్షలు మానండి.. పదేళ్లు అండగా నిలబడండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ప్రారంభం
కాకతీయ, తెలంగాణ బ్యూరో / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి ప్రభుత్వానికి అండగా నిలబడ్డదన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం.. అందుకే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఇక్కడి ఎర్త్ యూనివర్సిటీకి పెట్టడం గొప్ప అవకాశం అన్నారు. కొత్తగూడెంలో వర్సిటీని ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. అనంతరం వర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణను సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమని రేవంత్ అన్నారు. కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనేనని తెలిపారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రంను నిలబెడుతున్నాయని వివరించారు.

సర్పంచ్‌లు మంచివాళ్లు ఉండాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల కోరారని గుర్తు చేశారు. ఖమ్మం మంత్రుల చేతుల్లోనే పాలనకు ఆయువుపట్టయిన శాఖలు ఉన్నాయని అన్నారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యత నాది.. ప్రజా పాలనతో సుపరి పాలన అందిస్తున్నాం.. మంచి పాలన ఉంటే ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, చీరలు లాంటి వస్తాయి. అందుకే గ్రామాల్లో సర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి.. మంత్రులతో కలిసి పనిచేసే వాళ్లు కావాలి. అభివృద్ధి కోసం మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలి. గ్రామాల్లో రాజకీయ కక్షలు మానండి. పదేళ్లు అండగా నిలబడండి. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబడదాం.. అని రేవంత్ అన్నారు.

ఖమ్మం నుంచే ఏ పథకమైనా..
పదేళ్లు ప్రధాన మంత్రిగా మన్మోహన్‌సింగ్ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారు. దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ప్రపంచంతో పోటీ పడాలని తొలి ప్రధాని నెహ్రు ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చి గొప్ప గొప్ప యూనివర్సిటీలను ప్రారంభించారు. దేశంలో అహార ఉత్పత్తులను పెంచడానికి బాక్రానంగల్ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు అనేక ప్రాజెక్టులను నెహ్రు కట్టించారు. విద్య మాత్రమే తెలంగాణను ఉన్నతస్థానంలో నిలబెడుతుంది. అందుకే ఆవైపు ప్రయత్నాలు చేస్తున్నాం. సింగరేణిలాంటి సంస్థలను పెంచాలంటే ఎర్త్ యూనివర్సిటీ లాంటివి అవసరం. కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా పొలాలను పారించి సిరులు కురిపించాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు 10 యేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత పాలకులకు కమిషన్లు కురిపించాయి తప్ప నీళ్లు పారలేదు. తెలంగాణకు నేను సీఎంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల అనుకుంటే ఏమైనా జరుగుతుంది. ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది. రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు.. ఏ కార్యక్రమైనా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాం.. అని రేవంత్ అన్నారు.
త్వరగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తాం : భట్టి
దేశంలోనే అత్యున్నతమైన వర్సిటీని కొత్తగూడెంలో ప్రారంభించుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అనేది దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అద్భుతమైన వర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ దేశానికే తలమానికమని కొనియాడారు. వీలైనంత త్వరగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మన్మోహన్ సింగ్ రాష్ట్రాన్ని ఇచ్చారు : పొంగులేటి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఇచ్చిన ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ పేరుతో ఒక్క పథకం కూడా పెట్టలేదని విమర్శించారు. మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వంపై ఎప్పుడూ ఉండాలని కోరారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు : తుమ్మల
కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ వర్సిటీ భూవిజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమివ్వనున్న వర్సిటీ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుందన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.



