సర్పై చర్చకు కేంద్రం ఓకే
రెండో రోజూ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన
అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసిన స్పీకర్ ఓంబిర్లా
ఈనెల 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
కాకతీయ, నేషనల్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా ‘సర్’పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈమేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం, విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. ఆ ప్రకారం డిసెంబర్ 8న వందేమాతరంపై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘లోక్సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దానిపై డిసెంబర్ 8 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి చర్చ జరపాలని సమావేశం నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 9 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ మొదలవుతుంది అని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో తెలిపారు.
10 గంటల పాటు డిబేట్
కాగా, అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ.. ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు. సభలో 10 గంటల చొప్పున రెండు డిబేట్లకు సమయం కేటాయించారని, అవసరమైతే సమయం మరింత పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
రెండో రోజూ నిరసనలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజే సర్పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళన మధ్యనే సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షం పట్టుపట్టింది చివరకు వాకౌట్ చేసింది. చర్చకు ప్రభుత్వం విముఖంకాదని, కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం మాత్రం తగదని అధికారపక్షం పేర్కొంది. రెండో రోజూ సమావేశాల్లోనూ ఇవే అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎట్టకేలకు అధికార పక్షం చర్చకు అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా సర్పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.


