జాతర సమయంలో గట్టమ్మ వద్ద భద్రత పెంచాలి
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి
ములుగు ఎస్పీని కోరిన గట్టమ్మ పూజారులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ని మంగళవారం గట్టమ్మ ప్రధాన పూజారులు, ఆదివాసీ నాయక పోడు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా, ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, మరుగుదొడ్లు, వీధి దీపాలు వంటి సౌకర్యాలను మెరుగ్గా అందించాలని ఎస్పీని కోరారు. జాతర సమయంలో గట్టమ్మ దగ్గర జరిగే ‘ఎదురు పిల్ల పండగ’ వంటి ఆదివాసీ సంప్రదాయ కార్యక్రమాలపై ఎస్పీ స్వయంగా వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు, వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య, ఆకుల మొగిలి, కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల రఘు, కొత్త రవి, అరిగెల రవి, చిర్రా రాజేందర్, కొత్త రాజ్ కుమార్, చిర్రా మహేందర్, కొత్త నరేష్ తదితరులు పాల్గొన్నారు.


