దిష్టి రచ్చ
ఏపీ, తెలంగాణ మధ్య మాటల మంటలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల కలకలం
పవర్‌స్టార్ క్షమాపణ చెప్పాల్సిందే..
లేకుంటే ఆయన సినిమాలు ఆడనిబోమన్న మంత్రులు
తలతిక్క మాటలు మానుకోవాలంటూ వార్నింగ్
తెలంగాణ నుంచి తన్ని తరిమికొడ్తామని హెచ్చరిక
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రజలను, నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చేసిన కామెంట్లు కలకలంరేపుతున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి హెచ్చరించారు. “ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడడం బాధాకరం. కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారనడం అజ్ఞానం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే పవన్ కల్యాణ్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వం.. అంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు.

చంద్రబాబు స్పందించాలి
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరమని రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ దిష్టి అనడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మిత్రపక్షమైన తెలంగాణ బీజేపీ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని సూచించారు. రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉన్న రాష్ట్రాలు. తెలంగాణలోనూ తుఫాన్ వల్ల నష్టం జరిగితే ప్రకృతి విలయం అనుకుంటాం తప్ప ఆంధ్ర ప్రజలను తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకమంతుడో అవివేకమంతుడో నాకు తెలియదు. వెంటనే పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో వివక్షపూరిత మాటలు మాట్లాడకూడదు. సినిమా నటుడివి కాదు ఉప ముఖ్యమంత్రివి. కాస్త బాధ్యతగా వ్యవహరించు. .. అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

కొబ్బరి చెట్లుకు దిష్టి తగిలింది
గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమేనని తెలిపారు. గోదావరి జిల్లాలు కొబ్బరి చెట్లతో నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర నాయకులంతా అంటారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొబ్బరి చెట్లు మొండాలతో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని, అందుకే చెట్లు ఎండిపోయాయని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లిలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి కారణమైన శంకరగుప్తం డ్రెయిన్‌తో పాటు తోటలను నవంబర్ 26న ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మట్లాడుతూ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


