రియల్ ఎస్టేట్ పేరిట ఘరానా మోసం.. రూ. 330 కోట్లు స్వాహా!
వెల్త్ క్యాపిటల్ కంపెనీ భారీ మోసం బట్టబయలు
వడ్డీ ఆశ చూపించి 300 మందికి కుచ్చు టోపీ
330 కోట్ల స్కామ్‌పై నల్లగొండలో ఆందోళనలు
కాకతీయ, క్రైమ్ : ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టకుండానే భూమి కొని, ప్రతి నెలా వడ్డీ తెచ్చుకునే ‘సూపర్ ప్రాఫిట్’ ప్లాన్! ఎవరైనా ఈ ఆఫర్ వినిపిస్తే వెంటనే అనుమానం రావాలి. కానీ అధిక లాభాలు, రెట్టింపు రిటర్న్స్ చూపిస్తే ఎంత తెలివైన వాళ్లయినా ఒకసారి అయినా ఆలోచిస్తారు. అదే బలహీనతను క్యాష్ చేసుకున్న ఘరానా మోసం ఇప్పుడు నల్లగొండ–సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద వివాదంగా మారింది.
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారు. ‘రియల్ ఎస్టేట్ వెంచర్’ అని పేరు పెట్టి, ఒక్కసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి ఇస్తామన్నారు. అంతేకాదు 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, గడువు ముగిసే సరికి రూ.8 లక్షలు క్యాష్ హామీ ఇచ్చారు. మొదట్లో కొందరికి వడ్డీ చెల్లించడం, అందమైన మాటలు చెప్పడం… మొత్తం స్కీమ్‌ను నిజంగానే నమ్మేలా చేసింది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, అధికారులు, సాధారణ కుటుంబాలు.. ఎవరూ ఈ వల నుంచి తప్పించుకోలేకపోయారు.
అయితే కథ ఇక్కడే తిరిగేసింది. రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇచ్చిన పత్రాలు నకిలీ బాండ్ పేపర్లు మాత్రమేనని బాధితులు గ్రహించేనాటికి, వారి పెట్టుబడులు మొత్తం స్వాహా అయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాగర్‌పల్లిలో ఉన్న భూములను బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పినా… అక్కడ భూమి ఏదీ చూపించలేదు. నెల నెలా వడ్డీ కూడా కొందరికే చెల్లించడంతో మోసం బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.330 కోట్ల వరకు సేకరించారన్న బాధితుల ఆరోపణలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూపిస్తున్నాయి.
ఈ సంస్థ ఏజెంట్లు నల్లగొండ జిల్లాలో 300 మందికి పైగా పెట్టుబడులు పొందినట్టు సమాచారం. ఇప్పుడు వారందరూ ఒక్కొక్కరుగా మోసపోయామని గ్రహించి ఆందోళనకు దిగుతున్నారు. సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాశ్ ఇంటి వద్ద బాధితులు నిరసనకు దిగడంతో, పోలీసుల జోక్యం చేసుకుని ప్రకాశ్‌ను టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో బాధితులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసి న్యాయం కోరుతున్నారు. కాగా, రియల్ ఎస్టేట్ పేరిట మోసాలు కొత్తవి కావు. కానీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత స్పష్టంగా ప్రణాళికబద్ధంగా చేసిన స్కామ్ మాత్రం అరుదే. అధిక లాభం ఆశలో అమాయకుల కలలను దోచుకున్న ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


