ఆరెపల్లి వాగులో శ్మశాన వాటిక నిర్మాణం వద్దు
ప్రజాధనం వృథా కాకుండా మరో ప్రాంతంలోకి మార్చాలి
ఏఐఏఫ్‌బీ డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : ఆరెపల్లి వాగు ఒరుగులో నిర్మించనున్న స్మశానవాటికను మరో ప్రాంతానికి మార్చాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఏఫ్‌బీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శ్మశాన వాటికకు కేటాయించిన రూ.49.50 లక్షలు ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడేలా వినియోగించాలని కోరారు.
మంగళవారం ఏఐఏఫ్‌బీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి తేజ్‌దీప్ రెడ్డి, కార్యదర్శి బండారి శేఖర్ బృందం ఆరెపల్లి ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వాగులో స్మశాన నిర్మాణం ప్రజలకు ఉపయోగం కాకుండా కాంట్రాక్టర్‌లకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని వారు విమర్శించారు. వర్షాకాలంలో వరద నీరు ప్రవహించే ప్రమాదం ఉన్నందున అక్కడ నిర్మించిన నిర్మాణం కొట్టుకుపోయి ప్రజాధనం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదని, రైతులు 30 అడుగుల రహదారిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కావున వాగులో కాకుండా అనుకూలమైన ప్రాంతంలో స్మశానవాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫోన్ ద్వారా పిర్యాదు చేయగా కమిషనర్ విచారణకు అధికారులను పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


