ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి
కాకతీయ, కరీంనగర్ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి పిలుపునిచ్చారు. కరీంనగర్ ముకుందాల మిశ్రభవన్‌లో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా కోనెటి నాగమణి మాట్లాడుతూ 2026 జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరగనున్న మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవనున్నారని తెలిపారు. ప్రచారాన్ని గ్రామాల స్థాయికి విస్తరించాలని సూచించారు. ఐద్వా సంఘం వరకట్న నిరోధం, గృహహింస నిరోధం, విద్య, లైంగిక వేధింపుల నిరోధ చట్టాల అమలులో సాధించిన విజయాలను గుర్తుచేశారు. మహిళలపై హింస, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇంకా తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలు మహిళలను సమాజ అంచులలోకి నెట్టుతున్నాయని విమర్శించారు. వచ్చే మహాసభల్లో గత పోరాటాల సమీక్షతో పాటు భవిష్యత్ ఉద్యమ దిశ నిర్ణయించే తీర్మానాలు ఆమోదం పొందనున్నాయని మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి యు.లక్ష్మి, నాగమణి, మానస, కనుకలక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.


