మందుల వినియోగంపై అవగాహన కల్పించాలి
దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆర్థిక భారం తప్పించాలి
వైద్యులకు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచనలు
కాకతీయ, కరీంనగర్ : దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న మందుల వినియోగంపై అవగాహన కల్పించాలని కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధికారులకు సూచించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అధిక రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించి, నిర్ధారణ అయిన వారికి ప్రైవేట్ మందులు కొనాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. మంగళవారం రోజున పట్టణ ఆరోగ్య కేంద్రం మోతాజ్‌ఖానాలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పీవో ఎన్సీడీ, పీవో ఎంహెచ్ఎన్ అధికారులతో కలిసి కేంద్రాన్ని సందర్శించి ఆశా కార్యకర్తల పనితీరును వర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మాట్లడుతూ నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల గృహ ఆధారిత సంరక్షణ పర్యవేక్షణను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. శిశు సంరక్షణ, పోషకాహారం, ఆరోగ్య సమస్యల గుర్తింపు అంశాల్లో తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళా శిబిరాల్లో మహిళల రీ స్క్రీనింగ్ శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫాలోఅప్‌పై దృష్టి పెట్టాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం, బరువు తక్కువ పిల్లలను గుర్తించి, పోషకాహార పునరావాస జిల్లా కేంద్రానికి తరలించే విషయంలో తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. క్రమంలో ఆర్‌బీఎస్‌కే, 102 వాహనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఓ ఎన్సిడి డాక్టర్ ఉమాశ్రీ, పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇమ్రాన్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


