ఏజెన్సీ ఎస్సీలకు రిజర్వేషన్లలో అన్యాయం
మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్
కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో కలపడం ద్వారా ఎస్సీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుర్గం నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి న్యాయసమ్మతమైన పరిష్కార మార్గాన్ని సూచించాలని కోరారు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా భూభాగం ఏజెన్సీ ప్రాంతమేనని, ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎస్సీ జనాభా తీవ్ర అభివృద్ధి లోపాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌ను జనరల్ కేటగిరీలో కలపడం వల్ల వెనుకబడ్డ ఈ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నిర్మాణానికి ముందు ఏజెన్సీ మండలాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులో ఉండటం వల్ల ఎస్సీలకు తగిన అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాధించిపెట్టిన రాజ్యాంగ హక్కులను కాపాడాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని హితవు పలికారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లను పునరుద్ధరించి, రాజ్యాంగం కల్పించిన నిజమైన ప్రాతినిధ్యం ఎస్సీలకు అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.


