మెస్సితో తలపడేందుకు సీఎం సాబ్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్
వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఫొటోలు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యక్షంగా తలపడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న 7vs7 ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీకి ప్రత్యర్థిగా సీఎం రేవంత్ మైదానంలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జట్టుకు రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నారు. మ్యాచ్‌కు ముందే సీఎం ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఆదివారం రోజంతా అధికార కార్యక్రమాలు ముగించుకుని రాత్రి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి వెళ్లిన రేవంత్… ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి దాదాపు గంటపాటు సాధన చేశారు. మైదానంలో పరుగులు, బంతి నియంత్రణ, పాస్‌లు—సీఎం పూర్తి ఉత్సాహంతో కనిపించారు. మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో నవంబర్ 28 నుంచే అందుబాటులోకి వచ్చాయి. టికెట్ ధరలు రూ.1700 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ఈ ప్రత్యేక మ్యాచ్‌కు మెస్సీతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వీరంతా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగమవుతారని సమాచారం. డిసెంబర్ 13–15 వరకు మెస్సీ భారత్ పర్యటనలో ఉండనున్నాడు. 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ సందర్శన, అనంతరం అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరిక, డిసెంబర్ 14న ముంబై వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, డిసెంబర్ 15న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సందర్శన—అని షెడ్యూల్ ఖరారైంది. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమానికి మెస్సీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల క్రీడలు, పర్యాటకం, పెట్టుబడులు, యువత భాగస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సీఎం రేవంత్‌కు ఫుట్‌బాల్‌పై చిన్నప్పటి నుంచే మక్కువ. చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఈ క్రీడనే ఆడేవారట. మెస్సీ రాకతో హైదరాబాద్ గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్‌పై మరింత వెలుగు నిండుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


