ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు?
మెడికవర్ ఆస్పత్రిలో పేషెంట్ మృతిపై ఆందోళన
తెల్లారేసరికి అంతా నిశ్శబ్ధం
పేషెంట్ వారించినా ఆస్పత్రి వర్గాలు ట్రీట్మెంట్
ఆఖరికి మృతి చెందినట్లు ప్రకటన
ఫీజు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని బెట్టు
సంధి ఎవరు చేశారో? సద్దుమణిగిన వివాదం
కాకతీయ, వరంగల్ : వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హాస్పిటలు ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఆస్పత్రి యాజమాన్యం దూరపు చుట్టరికమనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఏం జరిగినా, ఏం చేసినా పట్టించుకునే వారు ఉంటారా? ఆదివారం రాత్రి కూడా అదే జరిగింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వొడితెల గ్రామానికి చెందిన ఓ పేషెంట్ ను అతడి కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. అయితే, అతనికి ఓ ఇంజెక్షన్ పడదని వారించినా అదే ఇంజెక్షన్ ఆస్పత్రిలో డాక్టర్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పేషెంట్ కొంత సమయానికి మృతిచెందినట్లు సమాచారం. అయితే, ముందుగా ఆ పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని చెప్పిన వైద్యులు.. కాసేపటికే మరణించాడని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అప్పటికి కూడా వైద్యులు పేషెంట్ తాలుకూ బిల్లు రూ.80వేల వరకు ఉందని, అది చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడం పేషెంట్ కుటుంబసభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు ఆస్పత్రి ఎదుట ఆదివారం రాత్రి 2గంటల వరకు ఆందోళనకు దిగారు.

తెల్లారేసరికి అంతా సైలెంట్!
మెడికవర్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పేషెంట్ మృతిచెందాడని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎవరు సంధి కుదిర్చారో గానీ, తెల్లారేసరికి అంతా నిశ్శబ్దంగా మారింది. ఆస్పత్రి వర్గాలు అసలు ఏం జరగనట్టే వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఏం జరిగిందని ఆరా తీసినా.. తాము నిన్న డ్యూటీలో లేమని.. ఆ విషయం తమకు తెలియదని పేర్కొనడం హాస్యాస్పదం, అనుమానాలకు తావిస్తోంది. తనకేమీ తెలియదంటూనే హైదరాబాద్ లో ఉన్న లీగల్ సెల్ నే మొత్తం చూసుకుంటుందని, వారే ఏదో చేసి ఉంటారని పేర్కొనడం గమనార్హం. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినందువల్లే ఇంత జరిగినా.. ఈ ఆస్పత్రి తీరుపై జిల్లా అధికారులు ఎవరూ కనీసం స్పందించకుండా వదిలేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆస్పత్రిలో బౌన్సర్లు!
వరంగల్ నగరంలో ఎన్నో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఏ ఒక్క ఆస్పత్రిలో ఇప్పటివరకు బౌన్సర్లు దర్శనమివ్వలేదు. కానీ, మెడికవర్ ఆస్పత్రిలో సోమవారం నలుగురు బౌన్సర్లు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రశ్నించే హక్కును హరించడానికే ఆస్పత్రి వర్గాలు ఈ రకమైన చర్యలు పాల్పడడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులను ఏనాడు సందర్శించని ప్రజాప్రతినిధులు, ప్రైవేటు ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి హాజరై.. ఆస్పత్రి వెనుక తామున్నామనే సంకేతాలు పంపుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.


