136 మొబైల్ ఫోన్లు రికవరీ
బాధితులకు అందజేసిన జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్
కాకతీయ, జగిత్యాల : ఇటీవలి కాలంలో జగిత్యాల జిల్లాలో మిస్సింగ్, దొంగలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మొత్తం 136 మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు సోమవారం అందజేశారు. స్వాధీనం చేసిన ఫోన్ల మార్కెట్ విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈసందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడుతూ మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తప్పనిసరి అని చెప్పారు. సీఐఈఆర్ (కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు) పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే ఫోన్ రికవరీ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.5 కోట్లకు పైగా విలువ గల 1548 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ పోయినప్పుడు నిర్లక్ష్యం చేస్తే, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందువల్ల అనుమానాస్పద కాల్స్, సందేశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. దొంగిలించిన ఫోన్లు నేరాలకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నందున తప్పనిసరిగా సీఐఈఆర్లో నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్‌హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ సీఐఈఆర్లో చెక్ చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర పోషించిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సీఐఈఆర్ బృందంలోని కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహ్మూద్, కానిస్టేబుల్స్ అజర్, యాకూబ్‌లను ఎస్పీ అభినందించారు. స్వాధీనం చేసిన ఫోన్లు అందుకున్న బాధితులు పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.


