కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరైన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 2019లో వెలుగులోకి వచ్చిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్లు ప్రాధాన్యంగా వినిపించాయి. ఆ కేసు అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
ఇప్పటికే బీజేపీలో గువ్వల బాలరాజు:
ఈ వ్యవహారంలో పేరున్న నేతల్లో గువ్వల బాలరాజు ఇప్పటికే బీజేపీలో చేరి, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రేపోమాపో మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ జాబితాలో పైలెట్ రోహిత్ రెడ్డి పేరు టాప్‌లో ఉందని చెబుతున్నారు.
రాజకీయ అర్థాలు:
పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరితే, ఫామ్ హౌస్ కేసులో ఉన్న మిగతా నేతల భవిష్యత్ రాజకీయ పయనంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


