కాకతీయ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై రాజస్థాన్‌లో 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్‌ను సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న డి ఆర్ డి ఓ గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ దేశ రహస్యాలు, వ్యూహాత్మక సమాచారం పాకిస్తాన్‌కు చేరవేస్తున్నాడని దర్యాప్తులో బయటపడింది.
ఉత్తరాఖండ్ లోని అల్మోరాకు చెందిన మహేంద్ర ప్రసాద్, సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ, క్షిపణి పరీక్షలు, ఇతర ఆయుధాల ట్రయల్స్‌కు వచ్చే డి ఆర్ డి ఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలికలపై సమాచారం అందజేస్తున్నాడని అధికారులు తెలిపారు. రాజస్థాన్ సిఐడి ఇన్‌స్పెక్టర్ డాక్టర్ విష్ణుకాంత్ ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘాను బలపరిచిన సందర్భంగా ఈ అరెస్ట్ జరిగింది.
నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా, గూఢచర్యానికి సంబంధించిన ఆధారాలు దొరికాయని తెలిపారు. 1923 అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, మహేంద్ర ప్రసాద్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తీసుకున్నారు. అతనిని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో పలు నిఘా సంస్థలు సంయుక్తంగా విచారిస్తున్నాయి.


