కాకతీయ, హనుమకొండ : హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వస్తున్న బీర్ల లారీ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సమ్మక్క బోర్డు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దెబ్బతినగా, లోపలలో ఉన్న సుమారు రూ. 25 లక్షల విలువైన బీర్ కార్టన్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బీర్ కార్టన్‌లు ఎవరూ తీసుకుపోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి కారణం లారీ వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను మరో రెండు గంటల్లో వెల్లడిస్తామని ఎక్సైజ్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.


