అవినీతిపరుల ఆరోపణలకు విలువలేదు
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్, బీజేపీ నేత మాజీ మేయర్ వై.సునీల్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు విలువ లేదని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఖండించారు. మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదలు చేసిన అంజన్‌కుమార్.. ఈసందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్‌ను పూర్తిగా అప్పుల్లో ముంచిన విషయం జనాలు విస్మరించలేదని అన్నారు. 2015–17 మధ్య కరీంనగర్ కార్పొరేషన్‌కు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించి మాట తప్పారని అన్నారు. టెండర్లు పూర్తి చేసిన పనుల్లో చాలా వాటికి బిల్లులు ఇవ్వకుండా పెండింగులో పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం బీఆర్ఎస్ పాలకవర్గం నిర్వహించిన అవినీతియేనన అన్నారు. 2018లో ఎన్నికల ముందు మళ్లీ విడుదల చేసిన 193 కోట్లతో చేసిన పనులు కూడా 2023 వరకు పూర్తి కాలేదు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సునీల్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సంతకాలు సేకరించడం సిగ్గుచేటని అన్నారు. స్మార్ట్ సిటీ నిధుల విషయంలో సునీల్ రావు రెండురకాల మాటలు మాట్లాడుతున్నారని, ఒకసారి కేసీఆర్ ఇచ్చాడంటూ, మరొకసారి కేంద్రం ఇచ్చిందంటూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.


