కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంత్రి కోమటిరెడ్డి కి పిచ్చి లేసిందంటూ.. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మెదడుకు నాలుకకు కనెక్షన్ కట్ అయి మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు సంవత్సరాలుగా ఆర్ & బీ మంత్రిగా ఒక్క గుంత పూడ్చ లేదుగానీ, ఒక ఇటుక కూడా పెట్టలేదుగానీ, దుబాయ్‌లో బోటు షికార్లు, అమెరికా పర్యటనలతో కాలం గడిపాడంటూ ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
ఫ్లైఓవర్, ఆర్ ఆర్ ఆర్ పనులపై ప్రశ్నలు..?
ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ కేంద్ర పరిధిలో ఉందని కూడా తెలియని స్థితిలో మంత్రి ఉన్నారని విమర్శించారు. రెండు సంవత్సరాలుగా ఫ్లైఓవర్, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ ఆర్ ఆర్) పనులు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఉత్తర భాగం ఆర్ ఆర్ ఆర్ పనులు, దక్షిణ భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ పాలన పోలికలు:
కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో 2.2% సగటుతో 2,511 కి.మీ జాతీయ రహదారులు ఉన్నా, కేసీఆర్ 10 ఏళ్లలో 4.45శాతం సగటుతో 2,472 కి.మీ కొత్త రహదారులు నిర్మించారని వివరించారు. అలాగే, ప్రభుత్వ భవనాలు, డబుల్ రోడ్లు, 4 లైన్ రోడ్ల నిర్మాణం బీఆర్‌ఎస్ హయాంలోనే విస్తృతంగా జరిగిందని అన్నారు. కేసీఆర్ పై మరోసారి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే, నల్గొండ ప్రజలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పిచ్చాసుపత్రికి పంపిస్తారని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.


