పంచాయతీ తొలి విడత నామినేషన్లు ప్రారంభం
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్లు గురువారం కరీంనగర్ జిల్లాలో విడుదలయ్యాయి. రెవెన్యూ డివిజన్ లోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో 92 సర్పంచ్, 866 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.రామడుగు మండలం వెదిర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. హెల్ప్‌డెస్క్, పోలీస్ బందోబస్తు, నోటీసు బోర్డులు, సిబ్బంది లభ్యత వంటి అంశాలను తనిఖీ చేశారు.నామినేషన్ దరఖాస్తుల స్వీకరణలో ఏవైనా లోపాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఫారాలు తీసుకున్న అభ్యర్థుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, దాఖలైన నామినేషన్ల రిపోర్టులు జిల్లా కేంద్రానికి సకాలంలో పంపాలని ఆదేశించారు.ప్రతి కేంద్రంలో అభ్యర్థులకు కావాల్సిన సహకారం అందించాలని, ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు.ఆమె వెంట తహసిల్దార్ రాజేశ్వరి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.


