కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ లక్ష్యాలు సాధించేందుకు కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.
రహదారులు నాగరికతకు చిహ్నాలు, రహదారులు అభివృద్ధి జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడికైనా ఉత్పత్తి అయిన వస్తువులను సునాయాసంగా తరలించవచ్చని అన్నారు.
రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి తద్వారా మన రాష్ట్ర యువతకు ఉపాధి, ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు తెలంగాణ రైసింగ్ లో భాగంగా ఇన్ఫ్రా, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలను ముందుకు తీసుకు వెళుతుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీల ద్వారా రాష్ట్రంలో 7,947 కిలోమీటర్ల మేర, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 17 ప్యాకేజీల ద్వారా 5,190 మేరకు రోడ్లు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
క్యాబినెట్ ఆమోదించిన రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు బ్యాంకర్ల తోనూ సమావేశం ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని, గత ప్రభుత్వ పెద్దలు 1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని, 45 వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీ చేసి ఆ బకాయిలు చెల్లించకుండా మాకు వారసత్వంగా ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్లారని డిప్యూటీ సీఎం తెలిపారు.
ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ప్రభుత్వ సెక్రటరీలు దృష్టి పెట్టి పనిచేయడంతో క్రమంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి కాంట్రాక్టర్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సంపద సృష్టిలో భాగస్వాములుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుంది, ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఇంకా కొన్ని రోడ్లను ఫోర్ లైన్ రోడ్లుగా మార్చాల్సి ఉంది త్వరగా ఆ జాబితా రూపొందించి క్యాబినెట్లో పెట్టి ఆమోదం పొందాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా 40శాతం నిధుల సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, భవిష్యత్తులో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఉండవని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలి, ham రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తాం అన్నారు.


