కరీంనగర్ నగరపాలక సంస్థపై బిఆర్ఎస్ పార్టీ ముట్టడికి సిద్ధం
కాకతీయ, కరీంనగర్ : నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించనున్నది. మంకమ్మతోట 37వ డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు.వీధుల్లో కుక్కలు, కోతులు, రోడ్లలో గుంతలు, ధూళి దుమ్ముతో నగర పరిస్థితి దారుణంగా ఉందని బిఆర్ఎస్ నేతలు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరపాలక సంస్థ పనులు నిలిచిపోతున్నాయని, ప్రభుత్వం ప్రజల సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం 135 కోట్ల రూపాయల పనులను చేపట్టి, 65 కోట్ల రూపాయలకు టెండర్లు పిలుపు చేసి పూర్తి చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి పనీ చేయలేదని నేతలు తెలిపారు. పారిశుద్ధ్యం, వీధీ దీపాలు, నీటి సరఫరా, డోర్-టు-డోర్ చెత్త సేకరణ వంటి సేవలు కూడా ఆగిపోతున్నాయని వారు తెలిపారు.సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, నగర ప్రజలు కలిసి రెండు-మూడు రోజుల్లో నగరపాలక సంస్థను ముట్టడించనున్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ నేతలు, వివిధ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


